ఇటీవల కోనసీమ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీ-పాలిటిక్స్‌లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. “తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కొబ్బరి మొక్కలు ఎండిపోయాయి” అని ఆయన వ్యాఖ్యానించడంతో, ఆ మాటలపై తెలంగాణ రాజకీయ నేతలు ఒక్కసారిగా మండిపడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ పవన్‌కు నేరుగా కౌంటర్ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన తెలిసి తెలియక మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. విషయమేమిటో, దాని ప్రభావం ఏంటో అర్థం చేసుకోకుండా మాట్లాడటం పవన్‌కు అలవాటైపోయిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పితే ఆయన సినిమాలు ఒకటి, రెండు రోజులు ఆడుతాయి… లేకుంటే తెలంగాణలో సినిమాలు ఆడవు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తాము ఎదుర్కొన్న నష్టాలను గుర్తు చేస్తూ, హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికే వాడుకున్నారు… మేం చాలా నష్టం చవిచూశామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం ఎదగలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ కోలుకుంటోంది… అలాంటి సమయంలో పవన్ ఇలా మాట్లాడటం బాధకరమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యతో తెలంగాణ-ఆంధ్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పవన్ మాటలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గాయపరిచాయని, దానికి బాధ్యత తీసుకోవాలని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పవన్ స్పందనపైనే ఉంది. మరి పవన్ క్షమాపణ చెబుతారా? లేక ఈ మాటల యుద్ధం ఇంకా ముదురుతుందా? అన్నది చూడాలి.