చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం చంద్రబాబు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గాల(హ్యాండ్ లూమ్స్)కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని చంద్రబాబు ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఆ విషయంపై చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు.
చేనేత మగ్గాల(హ్యాండ్ లూమ్స్)కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ హామీని అమలు చేయాలని విద్యుత్ శాఖా అధికారులను నేడు ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది.
విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం కుసుమ్ స్కీం కింద 4792 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్ అందించాలని సూచించారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని, 1000 ఈవీ బస్సులు కొనాలని, 5 వేల ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.