ఏపీ పాలిటిక్స్‌లో ప్రత్యామ్నాయం కోసం.. ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. దానికి సంబం ధించి బలమైన ప్రాతిపదికే లేకుండా పోయింది. ప్రస్తుతం మూడు పార్టీలు ఒక కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన-బీజేపీలు కలివిడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక, వైసీపీ 11 స్థానాలు దక్కించుకుని ఒంటరిపోరు చేస్తోంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ... దీని హవా పెద్దగా కనిపించడం లేదు. కమ్యూనిస్టు పార్టీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సో.. మొత్తంగా ఏపీలో కూటమి-వైసీపీ మాత్రమే బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నా ఓటు బ్యాంకు లేకపోవ డం.. కమ్యూనిస్టులకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు ఎన్నికల్లోనూ.. వైసీపీ-టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్యే పోరు సాగుతోంది. అయితే.. చిన్నా చితక పార్టీలు ఉన్నా.. పోటీ చేస్తున్నా.. అవి ఎన్నికల్లోను.. ఎన్నికల రాజకీయంలోనూ పెద్దగా బలమైన పాత్ర పోషించలేక పోతున్నాయి. దీంతో ఏపీలో ప్రత్యామ్నాయ శక్తి కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
గతంలో సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్న మేధావులు.. కనుమరుగయ్యారు. లోక్‌సత్తాను స్థాయి జేపీ, సమైక్యాంధ్ర పార్టీని పెట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక, నవ్యాంధ్రలో మార్పు కోసం అంటూ.. పార్టీపెట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ కూడా విఫలమయ్యారు. ఇప్పుడు వీరందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రత్యామ్నాయ తృతీయ శక్తిగా అవతరించేలా చేయాలన్నది ప్రజా సంఘాలు, చిన్న చితకా పార్టీల మధ్య జరుగుతున్న చర్చ.
ఈ పార్టీల సంఖ్య పరంగా పెద్దగానే ఉన్నా.. ప్రజల్లో ఆదరణ పరంగా మాత్రం పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. కాబట్టి.. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించినా.. అంతిమంగా ప్రజల ఆదరణ ముఖ్యమన్నది అందరికీ తెలిసిందే. దీనిని సాధించేందుకు బలమైన వ్యూహకర్త, ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేత దిశగానే అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు.. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయొచ్చు కానీ.. గెలిచే అవకాశం మాత్రం చాలావరకు తక్కువగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.