తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, హొం మంత్రి అమిత్ షాలకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజకీయాలను నేరుగా చేయాలని.. దొడ్డి దారిలో కాదని ఎద్దేవా చేశారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఢిల్లీలోని ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం రెండుఎఫ్ ఐఆర్‌లు నమోదు చేసింది.
ఈ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేసులకు భయపడే పార్టీ తమది కాదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం.. మోడీ షాలు పెట్టే కేసులకు భయపడుతుందా? అని ప్రశ్నిచారు. ఒక మంచి ఉద్దేశంతో ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ సంస్థను యంగ్ ఇండియా పేరుతో పునరుద్ధ రించారని.. రేవంత్ వివరించారు. ఈ క్రమంలో పాత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు షేర్ క్యాపిటల్‌కు సంబంధించిన నిధులను వాడుకున్నారని తెలిపారు.
ఈ క్రమంలో అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సొమ్మంతా.. నెహ్రూ, గాంధీల కుటుంబానివే అయినప్పుడు.. దీనిలో కేసు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే.. అప్పుడు కేసులు పెట్టినా అర్ధం ఉంటుందన్నారు. కానీ, తాజా కేసులో ఎక్కడా ప్రభుత్వ సొమ్ము కానీ.. వ్యక్తుల సొమ్ముకు కానీ నష్టం చేకూరలేదన్నారు. అయినప్పటికీ.. రాహుల్, సోనియాలపై కేసు పెట్టడం అంటే.. వారిని వేధించడమేనన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు.
అయితే.. మోడీ, షాలు పెట్టించే కేసులకు ఎవరూ భయపడబోరని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. ముఖ్యంగా సర్ ప్రక్రియ సహా.. ఇతర అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీలపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం రాహుల్, సోనియాలకు మద్దతుగా నిలుస్తుందని రేవంత్ చెప్పారు.