వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ బాంబు లాంటి వార్త పేల్చారు. దీనిపై వైసీపీ నాయకులు మండి పడుతున్నారు. ఆధారాలు బయట పెట్టండి.. లేకపోతే.. సారీ చెప్పండి అంటూ.. నాయకులు వ్యాఖ్యానించారు. నిజానికి తరచుగా జగన్‌పైనా.. వైసీపీ నాయకుల పైనా నారా లోకేష్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత. కూడా వైసీపీ హయాంలో జరిగిన నిర్ణయాలు, పనులను ఎండ గడుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్.. జాతీయ మీడియాకు ఇచ్చిన బైట్‌లో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావించారు. ఈసమయంలో జగన్ హయాంలో ఆయన విదేశీ పర్యటన లు, లోకల్‌గా వినియోగించిన హెలికాప్టర్లు, విమానాల ఖర్చులను నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ఏకంగా 222 కోట్ల రూపాయలను తన విమాన, హెలికాప్టర్ ఖర్చులకు ప్రభుత్వం వెచ్చించినట్టు తెలిపారు. ఇది ప్రజల సొమ్మును దుబారా చేయడమేనని వ్యాఖ్యానించారు.
తాడేపల్లి నుంచి పక్కనే 10 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్‌ను వినియోగించిన విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. ఇక, పరదాలు కట్టుకోవడం, చెట్లు నరకడం వంటివి కూడా చెప్పుకొచ్చారు. నిరుద్యోగు ల సమస్యలు, ప్రజల అవసరాలను ప్రస్తావించి.. వాటిని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా సొంత అవసరాలకు కోట్ల రూపాయలు వెచ్చించారని దుయ్యబట్టారు. అదేసమయంలో 500 కోట్లతో విశాఖలో రాజభవనం నిర్మించుకున్నారని కూడా తెలిపారు.
చంద్రబాబు విజన్ ముఖ్యమంత్రి అయితే.. జగన్ వేకేషన్ ముఖ్యమంత్రి అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురు దాడి చేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి.. ఏమైనా మాట్లాడితే చెల్లదని.. మీ దగ్గర ఆధారాలు ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సారీ చెప్పాలని.. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.