తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈరోజు ఏపీ పర్యటనకు బయల్దేరుతున్నారు. ఇది సాధారణ పర్యటన అయితే పెద్దగా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదు. కానీ పవన్ కల్యాణ్‌పై ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు, జనసేన క్యాంప్ నుంచి వచ్చిన కౌంటర్లు.. ఈ రెండు కలిసి ఈ ట్రిప్‌కు రాజకీయ హీట్‌ను పీక్‌కు తీసుకెళ్లాయి. అందుకే ఇప్పుడు కోమటిరెడ్డి ఏపీకి వెళ్తున్నాడు అనగానే జనసేన వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ కోనసీమలో మాట్లాడుతూ, “తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కొబ్బరి మొక్కలు ఎండిపోయాయి” అని సెటైర్ వేశారు. ఈ ఒక్క లైన్ తెలంగాణ రాజకీయ నేతల్ని బాగా మండించింది. ముఖ్యంగా కోమటిరెడ్డి అయితే నేరుగా, “పవన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల కాకుండా చేస్తాం” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన ఏపీకి రావడంపై పెద్ద చర్చకు కారణం అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’ కు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు కోమటిరెడ్డి ఏపీకి వస్తున్నారు. ఇది అధికారిక కార్యక్రమం అయినా… రాజకీయాల్లో ఇది కేవలం ‘ఆహ్వాన యాత్ర’గానే కనిపించడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు–రేవంత్ సంబంధాలు పాజిటివ్‌లో ఉన్నాయి. అలాంటి సమయంలో కోమటిరెడ్డి ఏపీకి వచ్చినా.. పవన్ కల్యాణ్‌ను కలుస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అధికారిక షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్‌తో మీటింగ్ లేదనే వార్త వినిపిస్తోంది. కానీ, ఎదురుగా ఏదైనా మీడియా ప్రశ్నిస్తే కోమటిరెడ్డి నోరు విప్పితే మళ్లీ వార్ స్టార్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.