సీఎం చంద్రబాబు తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా ప్రజలతో మమేకమైన ఆయన.. పిచ్చాపాటీగా.. తన ఆహార విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో చంద్రబాబు.. తరచుగా ప్రజలకు ఆరోగ్య సూత్రాలు చెబు తున్నారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. తన సభలకు వచ్చిన వారికి ఆరోగ్య మంత్రాలు చెబుతుంటారు. గతంలో ఏపీకి వచ్చినప్పుడు.. పవన్ కల్యాణ్‌కు దగ్గు తగ్గడానికి ప్రధాన మంత్రి మోడీ చాక్లెట్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలా.. ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా తన ఆరోగ్య రహస్యాలను ప్రజలతో పంచుకుంటున్నారు.
తాజాగా ప్రజలతో మాట్లాడిన చంద్రబాబు..తాను అన్నం తినడం ఎప్పుడో మానేసినట్టు తెలిపారు. ప్రస్తుతం గత పదేళ్లుగాప్రజలు కూడా మారుతున్నారని తెలిపారు. రైస్ తీసుకుంటే షుగర్ వస్తుందని.. అందుకే గత కొన్నాళ్లుగా రైస్ దాదాపు 40 శాతం మంది ప్రజలు మానేశారని చెప్పారు. తాను కూడా ఎప్పుడో రైస్ తీసుకోవడం మానేసినట్టు బాబు చెప్పారు. రాయలసీమ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని.. వారు అలా ఉండడానికి కారణం.. రాగులు, సజ్జలు, జొన్నలు కొర్రలు వంటి వాటిని అధిక మొత్తంలో తీసుకుం టున్నారని.. అందుకే వారిలో షుగర్ లక్షణాలు ఉండవని.. చెప్పారు.
ఆహారపు అలవాట్లను ఆరోగ్యాన్ని బట్టి అలవరుచుకోవాలని చంద్రబాబు చెప్పారు. ``ఒకప్పుడు నేనుకూడా అన్నంబాగానే తినేవాడిని. మా అమ్మ కొత్త ఆవకాయ పెడితే.. కంచం ఖాళీ చేసేవాడిని. కానీ, అలా ఇప్పుడు తినకూడదు. అందుకే ఆహారపు అలవాట్లను మార్చుకున్నా`` అని చంద్రబాబు చెప్పారు. ప్రజల కోసం.. వారి ఆరోగ్య సంరక్షణ కోసం.. త్వరలోనే కొత్త ఆహార ప్రణాళిక, ఆరోగ్య ప్రణాళికలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని చంద్రబాబు వివరించారు. తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.