నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా ‘అఖండ 2 – తాండవం’ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. పెయిడ్ ప్రీమియర్లకు హౌస్‌ఫుల్ బోర్డులు, థియేటర్ల వద్ద పూజలు, సోషల్ మీడియాలో అప్‌డేట్లతో బాలయ్య అభిమానులు సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ.. రిలీజ్‌కు కొన్ని గంటల ముందే వచ్చిన కోర్టు తీర్పు ఈ ఉత్సాహానికి గట్టి బ్రేక్ వేసింది.
బాలీవుడ్‌కు చెందిన ఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్.. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్ల బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈరోస్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన మద్రాస్ హైకోర్టు ఈ సినిమాపై మధ్యంతర స్టే విధించింది. దీంతో విడుదలకు రెడీగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌లో పడిపోయారు.
గతంలో మహేశ్ బాబు సినిమాలు ‘1–నేనొక్కడినే’, ‘ఆగడు’ నిర్మాణ సమయంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈరోస్ సంస్థ పని చేసింది. ఆ సినిమాల ఏర్పడిన భారీ నష్టాలకు సంబంధించిన ఆర్థిక వివాదమే ప్రస్తుత స్టేకు కారణమైంది. అదే భాగస్వాములు అయిన రామ్ ఆచంట – గోపి ఆచంట ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పేరుతో అఖండ 2 నిర్మించినందున, పాత బకాయిల బాధ్యత కూడా వారిదేనని ఈరోస్ సంస్థ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు, సినిమాపై తాత్కాలిక స్టే విధించింది.
ఖచ్చితంగా ఇవాళే పెయిడ్ ప్రీమియర్ల ద్వారా విడుదల చేయాలని ప్లాన్ చేసిన నిర్మాతలపై ఈ తీర్పు పిడుగులా పడింది. ఇప్పటికే బుక్ అయిన షోలు, చేసిన ప్రమోషన్లు అన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వివాదం పూర్తిగా ఆర్థిక సెటిల్‌మెంట్‌తో ముగిసే అవకాశం ఉంది. రెండు సంస్థల ప్రతినిధులు ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నారని, ఫ్యాన్స్ ఆందోళన పడాల్సిన పనిలేదని భావిస్తున్నారు. కోర్టు బయట క్విక్ సెటిల్‌మెంట్ జరిగితే సినిమా అనుకున్న టైమ్‌కి థియేటర్లలోకి రావచ్చని టాక్.