కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సీఎం సీటు కావాలంటే పార్టీలో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కౌర్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని కుదిపేశాయి. ఈ క్రమంలోనే పార్టీ హై కమాండ్ ఆమెపై చర్యలు తీసుకుంది. కౌర్ పై వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. నిరాధార ఆరోపణలు చేసిన ఆమెపై చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా అన్నారు. పార్టీపై ఆమె చేసిన ఆరోపణలు ఏ మాత్రం సహించరానివని అన్నారు.
తన భర్త సిద్ధూ పొలిటికల్ రీ ఎంట్రీకి రెడీ ఉన్నారని, కానీ బేషరతుగా ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కౌర్ డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రయోజనాల కోసమే తాము పోరాడతామని, కానీ, సీఎం సీటులో కూర్చోవడానికి తమ దగ్గర రూ.500 కోట్లు లేవని అన్నారు. అయితే, సిద్ధూను ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే, అటువంటిదేమీ లేదని కౌర్ చెప్పారు. కానీ, రూ.500 కోట్లు ఇచ్చిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. దీంతో, కౌర్ ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.