ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు .రావాలంటూ పలు కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో $15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న గూగుల్ బృందానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభం గురించి చర్చించారు.
విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో త్వరలో రాబోతున్న డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్ లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణ, గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్‌లకు మద్దతిస్తున్నామని సుందర్ పిచాయ్ చెప్పారు. చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు “వింగ్స్” తయారవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాష్ కోలే, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా పాల్గొన్నారు