టాలీవుడ్‌లో వందల సినిమాల్లో కనిపించి, చిన్న పాత్రలతోనైనా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నటి పావలా శ్యామల ఆత్మహత్యాయత్నం చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తెరపై నవ్వులు పంచిన ఆమె నిజ జీవితంలో మాత్రం పెద్ద పోరాటమే చేస్తోంది. కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె ఇద్దరూ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా ఆఫర్లు రావడం ఆగిపోయిన తర్వాత ఆదాయం ఏమీ లేకపోవడంతో వారి జీవితం అట్టడుగున పడిపోయింది.
వైద్యం చేసుకునే స్థోమత కూడా లేకపోవడంతో వారి పరిస్థితి ఒక్కసారిగా కుదేలైంది. సహాయం చేస్తామన్న మంచి మనసుతో కొందరు వారిని ఒక హోమ్‌లో చేర్పించారు. అయితే అక్కడ శ్యామల ఆరోగ్యం క్రమంగా దిగజారిపోయింది. సరైన సంరక్షణ అందించలేమని హోమ్ నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. ఈ దశలో తల్లి–కూతురు ఇద్దరూ పూర్తిగా ఒంటరయ్యారు. జీవితమే భారంగా మారింది.
తాము వెళ్లడానికి చోటు లేకపోవడంతో, శ్యామల కూతురితో కలిసి రోడ్డుపైకి వచ్చారు. అనారోగ్యం, ఆకలి, అవమానం అన్నీ కలిసి వారి మనసులో ఒక్క నిర్ణయాన్ని మాత్రమే మిగిల్చాయి.. ఆత్మహత్య. మరొకరికి భారమవడం ఇష్టం లేక, జీవితం మీద నమ్మకం కోల్పోయిన శ్యామల కూతురిలో కలిసి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. అదృష్టవశాత్తూ కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది వారిని రోడ్డుపై గమనించారు. వారి పరిస్థితి చూసిన వెంటనే తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌కి సమాచారమిచ్చారు. ఏసీపీ వెంటనే స్పందించి, వారికి అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
పోలీసుల సహాయంతో శ్యామల, ఆమె కుమార్తెను కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారిని సంతోషంగా అంగీకరిస్తూ, వైద్య సేవలు, ఆహారం, ఆశ్రయం అన్నీ కల్పించారు. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. కాగా, ఒకప్పుడు వందల సినిమాల్లో కనిపించిన శ్యామల నేటి పరిస్థితి పరిశ్రమలోని వృద్ధ కళాకారులు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాన్ని బయటపెడుతోంది.