పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరొక బిగ్ స్కామ్ బయటపడటం భక్తులను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. పరకామణి లో చోరీ, కల్తీ నెయ్యి సరఫరా వంటి అవినీతి ఘటనల తర్వాత, ఇప్పుడు శ్రీవారి పట్టు శాలువాలతో చేసిన రూ.55 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీవారికి విరాళాలు ఇచ్చే దాతలు, వీఐపీలను మల్బరీ పట్టు శాలువాలతో టీటీడీ సత్కరిస్తుంటుంది. అయితే ఆ పట్టు శాలువాలకు బదులుగా, ఓ సంస్థ100 శాతం పాలిస్టర్ శాలువాలను సరఫరా చేసినట్లు టీటీడీ విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ఒకటి రెండు కాదు ఏకంగా పదేళ్ల నుంచి ఈ మోసం జరుగుతుండటం గమనార్హం.
నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ కంపెనీ 2015 నుండి 2025 వరకు టెండర్ దక్కించుకుని, పట్టు శాలువులన్నీ 100 శాతం పాలిస్టర్‌తో నకిలీ తయారుచేసి, ప్రతి ఒక్కటి రూ.1,389కి టీటీడీకి విక్రయించింది. నిజానికి వీటి మార్కెట్ విలువ కేవలం రూ.350–400 మాత్రమే. పదేళ్ల కాలంలో సదరు సంస్థ ఏకంగా రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీకి విక్రయించింది.
టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, బెంగళూరు మరియు ధర్మవరం సిల్క్ బోర్డ్‌లలో చేసిన ల్యాబ్ పరీక్షలు ఈ నకిలీ పాలిస్టర్ శాలువుల నిజాన్ని నిర్ధారించాయి. టెండర్ నిబంధనల ప్రకారం మల్బరీ పట్టు, నిర్దిష్ట బరువు, పరిమాణం, ‘ఓం నమో వేంకటేశాయ’ అక్షరాలు, శంకు-చక్ర నామాలతో శాలువాలు నేయాలి. కానీ సదరు సంస్థ మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ తో శాలువాలను సరఫరా చేసింది.
ఈ మోసం భక్తుల విశ్వాసాన్ని, దేవస్థాన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బ తీయడంతో టీటీడీ పాలకమండలి వెంటనే చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తీర్మానం చేసింది. అదేవిధంగా బాధ్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌ను కోరింది.