దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులకు చుక్కలు చూపించిన భారత అతి పెద్ద వైమానిక సంస్థ ఇండిగో(ప్రైవేటు) పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. పౌర విమానయాన శాఖ మంత్రి, ఏపీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఇండిగోను వదిలి పెట్టేది లేదన్నారు. ప్రజలను, పౌర వ్యవస్థలను కూడా తీవ్ర ప్రభావితం చేసిన ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. దీంతో ఇండిగోపై చర్యలు ఎలా ఉంటాయి? నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటారా? లేక.. తూతూ మంత్రంగా తీసుకుని ఈ సారికి ఇంతేనని సరిపెడతారా? అనేది ఆసక్తిగా మారింది.
ఎయిర్ ఇండియా అనుభవంతో..
కొన్నాళ్ల కిందట.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి విదేశాలకు బయలు దేరిన టాటా సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా విమానం.. గాలిలోకి ఇలా లేచి అలా కూలింది. ఆ నాటి ఘటనలో 300 మంది ప్రయాణికులు సహా .. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ కూడా మృతి చెందారు. ఆ సమయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. ఎయిర్ ఇండియాపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. కానీ, ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాను కదిలించలేక పోయారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియానే కోర్టుకు వెళ్లడం.. తమపై కేసులు కొట్టివేయాలని కోరడం ఈ కేసులో ప్రధాన ట్విస్ట్.
ఇప్పుడు ఏం చేస్తారు?
మంత్రి రామ్మోహన్ నాయుడు కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూనే.. చర్యలు ఎలా ఉంటాయో హింటిచ్చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని.. ఆ కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కమటీ రిపోర్టు ఎప్పటి వస్తుందని .. సహజంగానే కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి సమయం పెట్టలేదని చెప్పారు. సో.. దీనిని బట్టి `కఠిన` చర్యలు ఎప్పటికి తీసుకుంటారన్నది ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.
మరోవైపు.. అదే మంత్రి రామ్మోహన్‌నాయుడు మరో ప్రకటన కూడా చేశారు. ఇండిగో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకున్నామన్నారు. వారు చెల్లించిన టికెట్ రుసుములను తిరిగి చెల్లించే విషయంపై ఆదేశించామన్నారు. ఈ నెల 15 లోగా అందరికీ నిధులు అందుతాయన్నారు. వాస్తవానికి ఇప్పటికే 85 శాతం మందికి తిరిగి ఇచ్చారు. ఇక, మళ్లీ బుక్ చేసుకునే వారిపై ఎలాంటి అదనపు రుసుములు లేకుండా టికెట్లు బుక్ చేయాలని ఆదేశించినట్టు కూడా చెప్పారు. ఇవన్నీ.. ప్రయాణికలును దృష్టిలో ఉంచుకుని చేసిన చర్యలుగా ఆయన వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి కఠిన చర్యలు ఎలా ఉంటాయన్నది అర్ధమవుతోందని పేర్కొంటూ.. కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.