హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రఖ్యాత లగ్జరీ స్పాట్లలో ఒకటి `తాజ్ బంజారా`. దశాబ్దాల నాటి ప్రతిష్టతో నిలిచిన ఈ హోటల్… ఇప్పుడు మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చింది. కానీ ఈసారి కారణం దాని గ్లామర్ కాదు.. రూ. 315 కోట్ల భారీ ల్యాండ్ డీల్. నగర రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు కళ్లుపెట్టే ఈ ఐకానిక్ ప్రాపర్టీని ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ రెడ్డికు చెందిన ఔరో రియాల్టీ అధికారికంగా సొంతం చేసుకుంది.
బంజారాహిల్స్ అందానికే ప్రత్యేక గుర్తింపు ఇస్తూ నిలిచిన తాజ్ బంజారా… 80వ దశకంలో హైదరాబాద్‌లో స్టార్ హోటల్స్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన ఫస్ట్ జనరేషన్ హోటల్. 3.5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్, అందమైన సరస్సు, బంజారాహిల్స్ హార్ట్‌లో ఉన్న అల్ట్రా-ప్రీమియం వాతావరణం.. ఇవన్నీ కలిపి ఈ హోటల్‌ను క్లాసిక్‌గా నిలబెట్టాయి.
ముగిసిన జీవీకే–తాజ్ యుగం..
నాలుగు దశాబ్దాలపాటు తాజ్-జీవీకే హోటల్స్ లీజు ఆధారంగా నిర్వహించిన ఈ ప్రాపర్టీ, అనేక అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, సినిమా ఈవెంట్స్, హైప్రొఫైల్ మీటింగ్స్‌కు వేదికైంది. కానీ 2023లో లీజు గడువు ముగియడంతో భూ యజమాని ఈ విలువైన స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించారు. అక్టోబర్ 31, 2025 న జరిగిన ఈ లావాదేవీలో, ఔరో రియాల్టీ మొత్తం రూ. 315 కోట్లు చెల్లించి హోటల్, భూమి హక్కులను సొంతం చేసుకుంది. దీనికోసం మరో రూ. 17.3 కోట్లు స్టాంప్ డ్యూటీగా ప్రభుత్వానికి చెల్లించింది.
బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో ఇదొక బిగ్ డీల్ గా చెబుతున్నారు. ఈ డీల్ తో బంజారాహిల్స్‌లో రియల్ ఎస్టేట్ రేట్లు మరింత పెరగబోతున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఇక ఈ కొనుగోలు వెనుక నిలిచిన వ్యక్తి శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి వియ్యంకుడి కుమారుడు. అరబిందో వారసుడు. లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన తర్వాత కంపెనీ నుంచి తప్పించబడ్డ వ్యక్తి. ఆయన ఇప్పుడు విడిగా నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ ఔరో రియాల్టీ.
మొదట ఈ సంస్థ పేరే అరబిందో రియాల్టీ. కానీ ఫార్మా గ్రూప్ వాటాదారుల అభ్యంతరాలు రావడంతో పేరు మారి ఔరో రియాల్టీ అయింది. పేరు మారినా, వారి దూకుడు మాత్రం తగ్గలేదు. ఈ కంపెనీ ఇప్పటికే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ హైరైజ్ ప్రాజెక్టులు చేపట్టింది. అయితే తాజ్ బంజారా కొనుగోలు తర్వాత—ఈ హోటల్ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హోటల్‌ను పునరుద్ధరించి మళ్లీ హోటల్‌గా నడపాలన్న ఉద్దేశం కంటే, భారీ హైరైజ్ లగ్జరీ అపార్టుమెంట్స్ నిర్మించాలనే ఆలోచన ఔరో రియాల్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.