తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి అంటే భక్తులు సమర్పించిన హుండీ నగదును లెక్కించే అత్యంత పవిత్ర స్థలం. ఇక్కడ ప్రతి నాణెం, ప్రతి నోటు, ప్రతి మూవ్ కఠినమైన భద్రతా వ్యవస్థలోనే జరుగుతుంది. అలాంటి ప్రాంతంలోనే నగదు చోరీ చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తిరుమల పరకామణి చోరీ కేసులో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పరకామణి చోరీ కేసు ఇక సాధారణ కేసు కాదని, వ్యవస్థలో దాచిన నిజాలను వెలికితీయాలని న్యాయస్థానం స్పష్టంగా తెలిపింది.హైకోర్టు సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. కేసు నమోదు చేసి, చట్టపరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు డైరెక్టర్ జనరల్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును వేగవంతం చేసేందుకు, రెండు సంస్థలు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సూచించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్‌కు సంబంధించిన ఆస్తులపైనా విచారణ కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. చోరీ అయిన నగదు అసలు ఎక్కడికి వెళ్లింది? ఎవరి ద్వారా మార్పిడి జరిగింది? ఎవరెవరు లాభపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో ఇది కీలకంగా మారనుంది. ఇకపోతే గతంలో ఈ కేసు లొక్ అదాలత్‌లో రాజీ అయిన విషయం తెలుసిందే. అయితే ఆ రాజీ వెనుక ఉన్న కారణాలు, ఎవరి ప్రభావం ఉందో, ఏదైనా కీలక ఆధారాలు దాచబడ్డాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కోర్టు మరో కీలక అంశాన్ని టచ్ చేసింది.. అప్పట్లో తిరుమలలో ఏవీఎన్వోగా పనిచేసిన వై. సతీష్ కుమార్ ఆకస్మిక మరణం. ఆయన పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్ కు సమర్పించాలని సీఐడీకి ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ ఆదేశాలతో ఇప్పటివరకు బయటపడని అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.