హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు శర్వానంద్.. ఈ నెల 6న బైకర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాలనుకున్నాడు. కానీ ఆ సినిమా అనూహ్యంగా వాయిదా పడిపోయింది. దీంతో పాటే శర్వా నారీ నారీ నడుమ మురారి సినిమా చేసిన సంగతి తెలిసిందే. బైకర్ ఛాన్స్ మిస్సయినప్పటికీ.. సంక్రాంతికి నారి నారి నడుమ మురారి మూవీతో బాక్సాఫీస్ బరిలో నిలవాలని శర్వా ఫిక్సయ్యాడు.
అంత పోటీలో ఈ సినిమాకు ఛాన్సుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి కానీ.. టీం మాత్రం పండక్కి ధీమాగా తమ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తోంది. సామజవరగమనతో పెద్ద హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండక్కి సరైన సినిమా అవుతుందని టీం అంటోంది. ఈ చిత్రానికి జనవరి 15ను రిలీజ్ డేట్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఐతే అంతకంటే ముందే నారి నారి నడుమ మురారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జనవరి 14న భోగి రోజు సాయంత్రం షోల నుంచే శర్వా సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. సాయంత్రం 5.49 గంటలకు ఈ సినిమా రిలీజ్ కోసం ముహూర్తం నిర్ణయించారు. అంటే 14న ఫస్ట్ షోలతోనే సినిమా రిలీజైపోతుందన్నమాట. ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్‌కు ముందు రోజు సెకండ్ షోతో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. నారి నారి నడుమ మురారికి రేట్లు పెంచి స్పెషల్ ప్రిమియర్స్ వేసే పరిస్థితి లేదు. నార్మల్ రేట్లతోనే ముందు రోజు సాయంత్రం నుంచే షోలు వేసేస్తున్నారు.
ఈ మధ్య రవితేజ మూవీ మాస్ జాతరకు కూడా ఇలాగే చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 31న బాహుబలి: ది ఎపిక్ రిలీజ్ ఉండడంతో.. ఆ రోజు ఫస్ట్ షోలతో సినిమాను రిలీజ్ చేశారు. శర్వా సినిమా కూడా అదే రూట్ ఫాలో అవుతోంది. ఈ చిత్రంలో శర్వా సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు సంయుక్త కాగా.. ఇంకొకరు ఏజెంట్ భామ సాక్షి వైద్య. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద అనిల్ సుంకర నిర్మించారు. వచ్చే సంక్రాంతికి మొత్తంగా అరడజను సినిమాల దాకా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.