తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పిడతల రామ భూపాల్ రెడ్డి (89) గురువారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే టీడీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గిద్దలూరు రాజకీయాల్లో రామ భూపాల్ రెడ్డి పేరు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఎమ్మెల్యేగా అవతరించారు. సాదాసీదా స్వభావం, ప్రజల్లో కలిసిపోవడంలో ఆయనకున్న నైపుణ్యం ఆయన్ను ఆ ప్రాంతంలో మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. పదవీకాలం అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నాయకత్వం, అనుభవం విషయంలో టీడీపీ వర్గాలు ఇప్పటికీ ఆయనను ఎంతగానో గౌరవించేవి.

రామ భూపాల్ రెడ్డి మరణవార్త తెలుగుదేశం పార్టీలోనే కాదు, రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర విచారాన్ని నెలకొల్పింది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇక ఆయన చివరి ప్రయాణం కోసం ఏర్పాట్లు గిద్దలూరులో జరుగుతున్నాయి. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో గిద్దలూరు అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.