జగన్ ముఠాకు సాక్షులను చంపడం.. చంపించడం అలవాటేనని టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు.. జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. తిరుమల శ్రీవారి పరకామణి దొంగతనం కేసు చిన్నదేనని.. 70 వేలు చోరీ చేసినా 14 కోట్ల రూపాయల మేరకు ఆస్తులను రవికుమార్ ఇచ్చాడని చెప్పడం పై నెహ్రూ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ముఠా అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి దారుణ హత్యను గుండెపోటు అని ప్రచారం చేశారని, దీనిలో సాక్షులుగా ఉన్న వారిని కూడా హత మార్చారని ఆయన పేర్కొన్నారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో కూడా.. సాక్షులను దారుణంగా చంపేశారని.. దీని వెనుక జగన్ ముఠా సభ్యులు ఉన్నారని ఆరోపించారు. ``ఇవన్నీ.. సమాజానికి పెద్దవి. కానీ, జగన్ ముఠాకు చాలా చిన్నవి`` అని నెహ్రూ అన్నారు.
ఇలానే.. పరకామణి కేసులోనూ.. జగన్ సహా వైవీ సుబ్బారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డిలకు వాటాలు అంది ఉంటాయని.. వాటిపై కూడా విచారణ చేయాలని నెహ్రూ సూచించారు. ``ఆయన అధికారంలో లేకుండానే వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నాడు. అధికారంలోకి వచ్చాక.. మరిన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెనుకేసుకున్నాడు. అలాంటి వ్యక్తికి తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు ఎలా కనిపిస్తాయి? ఆయనకు ఇది చిన్న కేసుగా కనిపించడం ఆశ్చర్యం కాదు`` అని అన్నారు.
ఈ ముఠా ఆగడాలు, దోపిడీలపై ఎంతైనా విచారించాల్సి ఉంటుందని నెహ్రూ వ్యాఖ్యానించారు. త్వరలో నే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దీనిపై విచారణ జరిపించేలా లేఖ రాస్తానని చెప్పారు. ``పరకామణి దొంగతనం కేసులో కేవలం రవికుమార్ మాత్రమేఉన్నాడన్నది వాస్తవం కాదు. దీని వెనుక జగన్, ఆయన బాబాయి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ కోణంలోనే విచారణ జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయి`` అని వ్యాఖ్యానించారు.