ఏపీ సీఎం చంద్రబాబుకు తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్కులు వేశారు. చిత్రంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా సీఎం చంద్రబాబు.. తన మంత్రి వర్గంలోనిసభ్యులు, తన పార్టీ ఎమ్మెల్యేలకు మార్కులు వేస్తారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారు? ఎవరు ప్రజల మధ్య ఉంటున్నారు? ఎవరెవరు.. ఎలా పనితీరు ప్రదర్శిస్తున్నారు? అనే విషయాలపై చంద్రబాబే తరచుగా మార్కులు వేస్తుంటారు.
అలాంటిది తొలిసారి ఆయనకు మార్కులు వేయడం. అదికూడా ప్రధాని నరేంద్ర మోడీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు పాలనకు మంచి మార్కులు వేశా రు. ఆయన పనితీరుతో ఏపీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అంతేకాదు.. త్వరలోనే ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.
నిరంతరం పెట్టుబడల వేట సాగిస్తున్నారని.. ఇది రాష్ట్రానికి మంచి పరిణామమని కూడా చంద్రబాబు చెప్పారు. దేశంలో ఏపీకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని.. చంద్రబాబు బాధ్యతలుచేపట్టిన తర్వాత.. పెట్టుబడులకు కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని కూడా ప్రధాని కితాబునిచ్చారు. ఆయన పాలన బాగుందని కూడా వ్యాఖ్యానించడం మరింత విశేషం.
వాస్తవానికి 2014లో కూడా.. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు జట్టుకట్టారు. తర్వాత.. 2024 ఎన్నికల్లో మరోసారి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ప్రధాని మోడీ ఇలా.. చంద్రబాబు పాలనకు మార్కులు వేయలేదు. ఇప్పుడే తొలిసారి ఆయన పాలనకు మార్కులు వేయడం గమనార్హం. ఒక్క చంద్రబాబు అనేకాదు.. ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ మోడీ మార్కులు వేసింది లేదు. కానీ, తొలిసారి చంద్రబాబుకు ఆయన మార్కులు వేయడం.. పాలన బాగుందని, పెట్టుబడులు తెస్తున్నారని కూడా చెప్పడం విశేషం.