నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ–2’ సినిమా ఎట్టకేలకు నేడు విడుదలైన సంగతి తెలిసిందే. గురువారమే ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అయితే సినిమా హంగామా కంటే కూడా ప్రస్తుతం ఈ చిత్రం టికెట్ రేట్ల వివాదమే ఎక్కువ దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని చిత్ర యూనిట్, ఆన్‌లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషో విస్మరించారని వచ్చిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద కలకలం రేపుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ‘అఖండ–2’ కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఒక మెమో జారీ చేసింది. కానీ అదే మెమోను హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. అంటే, పెంచిన రేట్లతో టికెట్లు విక్రయించొద్దని కోర్టు చెప్పినట్టే. అయితే, ఈ ఆదేశాల తర్వాత కూడా రాత్రికి రాత్రే ప్రీమియర్ షోలు నిర్వహించి, అధిక రేట్లకే టికెట్లు అమ్మేశారనే ఆరోపణలతో న్యాయవాది విజయ్ గోపాల్ ధిక్కరణ పిటిషన్ వేసారు.
ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. అయితే కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పెంచిన ధరలకే టికెట్లు అమ్మడంపై ధర్మాసనం ఘాటు స్పందించింది. “మాకు కోర్టు ఉత్తర్వులు అందేసరికే ప్రేక్షకులు ముందే టికెట్లు బుక్ చేసేశారు” అని బుక్‌మైషో తరఫు న్యాయవాది వాదించినా, ధర్మాసనం దీనిని అంగీకరించలేదు. “ఇప్పుడు కూడా పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారా? ఆన్‌లైన్‌లో చూపించే రేట్లు ఏమిటి?” అంటూ కోర్టు నేరుగా నిలదీసింది.
కోర్టు ఆదేశాలు మీకు అంత చిన్నవిగా అనిపించాయా? అంటూ ప్రశ్నించింది. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సినిమా ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.