బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత.. తాజాగా బీఆర్ ఎస్ పార్టికి చెందిన అధికారిక ఛానెల్ `టీ-న్యూస్` సహా ఇద్దరు ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు పంపించారు. వీరిలో ఒకరు బీజేపీ ఎమ్మె ల్యే కావడం విశేషం. ఇక, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా కవిత నోటీసులు పంపించా రు. ఈ నోటీసులపై వారం రోజుల్లోనే స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే.. న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఎందుకు?
`జన జాగృతి` పేరుతో కవిత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బీఆర్ ఎస్ సహా.. బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో యాత్ర చేసిన సమయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన `బీటీ(బీజేపీ-టీడీపీ)` బ్యాచ్ అంటూ.. దుయ్యబట్టారు. అంతేకాదు.. ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకున్నారని విమర్శించా రు. ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాధవరం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
``కవిత దుర్మార్గపు రాజకీయ నాయకురాలు`` అంటూ ఆవేశ పూరిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టీ-న్యూస్‌లోనూ ఆయన విమర్శలు గుప్పించారు. కవిత, ఆమె భర్త కలిసి భూములు దోచుకున్నారని, దీనికి సంబంధించిన ఆధారం తనవద్ద ఉందని కూడా చెప్పారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి కూడా జత కలిశారు. కవితపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే కవిత తాజాగా అటు టీ-న్యూస్, ఇటు ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. వారంలోగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేకపోతే.. పరువు నష్టం దావా వేస్తానన్నారు.
అయితే.. ఈ నోటీసులపై మాధవరం మౌనంగా ఉన్నారు. మరోవైపు.. పార్టీ కూడా కవిత విషయంలో సైలెం ట్ అయింది. ఆమె గురించి ఎవరు మాట్లోద్దని ఇది వరకే పార్టీ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. కవితను అనవసరంగా నాయకురాలిని చేసినట్టు అవుతుందని కూడా అన్నారు. ``ఈ రచ్చమనకెందుకు.. మనం గమ్ముగుందాం!`` అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కవిత యాత్ర తాలూకు అంశాలపై కూడా ఎవరూ మాట్లాడుకోవడం లేదు.