తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థి పార్టీలపై కాకుండా, సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు టీడీపీలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పాత వివాదం పూర్తిగా చల్లారకముందే, మరో కొత్త వివాదంతో కొలికపూడి హెడ్‌లైన్స్‌లో నిలిచారు.
ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి చేసిన ఆరోపణలు పార్టీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేశారని, అక్రమ కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నారని కొలికపూడి చేసిన ఆరోపణలు పార్టీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంతో క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ ముందు హాజరైన కొలికపూడి తన వాదనలు కూడా వినిపించారు. అయితే, ఈ వ్యవహారంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
ఇలాంటి పరిస్థితుల్లోనే కొలికపూడి మరోసారి సొంత పార్టీ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్” అంటూ విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్నికి సన్నిహితుడిగా ప్రచారం ఉండటంతో, కొలికపూడి దాడి వెనుక అంతర్గత రాజకీయాలే కారణమా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే మరో వివాదానికి కొలికపూడి తెరలేపడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ లోపలి అంశాలను బహిరంగంగా సోషల్ మీడియాలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ కూడా ఊపందుకుంటోంది. మరి ఈసారి కొలికపూడి తీరుపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.