భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ `ఇండిగో`లో ఇటీవల ఏర్పడిన సంక్షోభం ఎంత సంలచనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్లు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో వేలాది మంది ప్రయాణికులు టెర్మినళ్లలోనే చిక్కుకుపోయారు. కొందరికి ప్రత్యామ్నాయ విమానాలు లేకుండా, వసతి-భోజన సౌకర్యాలు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఊరట కల్పించేలా ఇండిగో సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.500 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానం బయలుదేరే సమయానికి 24 గంటల ముందే రద్దైన ఫ్లైట్ల ప్రయాణికులు ఈ పరిహారానికి అర్హులు. ముఖ్యంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో రద్దు లేదా తీవ్ర ఆలస్యానికి గురైన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే విమానాశ్రయాల్లో గంటల తరబడి చిక్కుకుపోయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు.
నష్టపరిహారం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, సులభంగా ఉంటుందని ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే కొంతమంది ప్రయాణికులకు టికెట్ రిఫండ్‌లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన ప్రయాణికులను జనవరిలో నేరుగా సంప్రదించి, అవసరమైన వివరాలు సేకరించి పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, ఫ్లైట్ డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని కంపెనీ పేర్కొంది.
విమానాల రద్దు, ఆపరేషన్ లోపాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇప్పటికే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిచి వివరణ కోరింది. మరోవైపు ఈ సంక్షోభానికి గల అసలు కారణాలను విశ్లేషించేందుకు ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని అంతర్జాతీయ సంస్థను నియమించడం గమనార్హం.
కాగా, గత నాలుగు రోజులుగా విమాన కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని ఇండిగో వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఫ్లైట్లు నడుపుతున్నామని, ప్రయాణికులకు ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.