నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులతో పాటు నేషనల్ లెవల్ చర్చకు దారి తీసింది. కారణం ఆదివారం అఖండ 2 సక్సెస్ మీట్‌లో బోయపాటి చేసిన ఓ ప్రకటన. ఇంతకీ విషయం ఏంటంటే.. సనాతన ధర్మం, హిందుత్వం, దేశభక్తి వంటి బలమైన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను దేశ ప్రధాని నరేంద్ర మోదీ వీకించబోతున్నారట. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా వెల్లడించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేకంగా స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మోదీ గారు ఇప్పటికే ఈ సినిమా గురించి విన్నారని, చూడటానికి ఆసక్తి వ్యక్తం చేశారని.. త్వరలోనే ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ కు సంబంధించిన డేట్, పూర్తి వివరాలు ప్రకటిస్తామని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.
దేశ అత్యున్నత నాయకుడు ఒక తెలుగు సినిమాను ప్రత్యేకంగా వీక్షించబోతున్నారన్న విషయం సినీ వర్గాల్లో గర్వకారణంగా మారింది. రీజినల్ సినిమా స్థాయిని దాటి ‘అఖండ 2’ నేషనల్ లెవెల్ టాక్ తెచ్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలకృష్ణ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ సినిమా నిలుస్తోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే… విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ హౌస్‌ఫుల్ షోస్, రికార్డు వసూళ్లతో ‘అఖండ 2’ దూసుకుపోతోంది. మోదీ వీక్షణ వార్తతో సినిమా హైప్ మరింత పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.