తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారు. ఆయన త్యాగానికి గుర్తుగా ఇకపై ఆ ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' నిర్మిస్తామని ప్రకట విడుదల చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం, ఆ తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారని గుర్తు చేసుకున్నారు. పొట్టిశ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని కొనియాడారు.