ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ అంశాన్ని కేంద్రంగా చేసుకుని అధికార – ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతోనే కాదు… మాస్ డైలాగ్స్‌తో వైసీపీ శిబిరాన్ని టార్గెట్ చేశారు పవన్.
ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్షిప్ (PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టాలని భావిస్తుండగా… దీనిని వైసీపీ ప్రైవేటీకరణగా ముద్ర వేస్తోంది. ఈ అంశంపై జగన్ కోటి సంతకాల ఉద్యమం చేపట్టడమే కాకుండా, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం అందించారు. అంతేకాదు… మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకొచ్చే వారిని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన పవన్ కళ్యాణ్… వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి ఎప్పుడు వస్తారు అన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం తాము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరజీవి పేరిట జలజీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత చర్చకు దారి తీసింది.
అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదు. ఇక ఇప్పుడు భయపడే ప్రశ్నే లేదని స్పష్టం చేసిన పవన్… గీత దాటి మాట్లాడితే తాట తీస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా ట్రీట్‌మెంట్ ఇస్తేనే సెట్ అవుతారు. కాలికి కాలు, చేతికి చెయ్యి అన్నట్టుగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. రాజకీయంగా తాము ఒక నిర్ణయం తీసుకుంటే ఏమైపోతారో తెలుసుకోండి అంటూ వైసీపీ నేతలకు సూటి హెచ్చరిక పంపించారు. పద్ధతులు మార్చుకోండి. గీతలు దాటి మాట్లాడే వారి చేతుల్లోనే గీతలు తీసేస్తాం అంటూ మార్క్ పంచ్‌లతో పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.