దేశంలోనే అత్యంత హైప్రొఫైల్ రాజకీయ–ఆర్థిక కేసుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు మరోసారి చర్చకు వచ్చాయి. 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసుల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామం న్యాయవ్యవస్థపై, విచారణ వేగంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. నాంపల్లి సిబిఐ కోర్టులో ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి రఘురాం బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కొత్త జడ్జి పట్టాభి రామారావు బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ కేసుల విచారణ మళ్లీ మొదటి దశకు వచ్చినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దాదాపు 43 వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంట్రీ ఇచ్చి మనీలాండరింగ్ కోణంలో ఆరోపణలను ధ్రువీకరించింది. 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అదే సమయంలో జగన్‌పై వచ్చిన ఆరోపణలు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కఠినంగా స్పందించేలా చేశాయి. ఫలితంగా సిబిఐ, ఈడీ దర్యాప్తులు ప్రారంభమయ్యాయి. మొత్తం 11 కేసులు నమోదు కావడం అప్పటి రాజకీయ వాతావరణంలో సంచలనంగా మారింది.
2012లో అరెస్టైన జగన్, రిమాండ్ ఖైదీగా దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌కు షరతు విధించారు. 2019 ఎన్నికల వరకు ఆయన క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు హాజరు విషయంలో మినహాయింపు లభించింది. అయితే కేసుల విచారణలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు. డిశ్చార్జ్ పిటిషన్లు, సాక్షుల విచారణలో జాప్యం, న్యాయమూర్తుల బదిలీలు, పదవీ విరమణలు కేసుల్ని ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ కేసులను విచారించిన పలువురు న్యాయమూర్తులు మారిపోయారు. తాజాగా మరోసారి జడ్జి మారడంతో, ఇప్పటివరకు సాగిన విచారణపై కొత్త జడ్జి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేసు మరోసారి రీసెట్ అయినట్లే అన్న చర్చ రాజకీయ, న్యాయ వర్గాల్లో సాగుతోంది. దేశంలోనే అత్యంత కీలకమైన కేసుల్లో ఒకటిగా చెప్పుకునే జగన్ అక్రమాస్తుల కేసులు 12 ఏళ్లు గడిచినా తుది తీర్పు దిశగా అడుగులు వేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. న్యాయం ఆలస్యం అయితే న్యాయం దూరమైనట్టే అన్న భావన ఈ కేసులో మరింత బలపడుతోంది.