విజయనగరం పూసపాటి రాజవంశం గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. ఆ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన ఘనత ఆ వంశస్థులది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వంశస్థులు మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీలో ఏవియేషన్ ఎడ్యు సిటీ ఏర్పాటుకు దాదాపు రూ.1000 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద మాన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి కావస్తున్న క్రమంలో ప్రపంచస్థాయి ఏవియేషన్ యూనివర్సిటీల బ్రాంచులు ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ తలచారు. ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్ట్ తరఫున మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు.
ఆ ప్రాజెక్టుకు తమ వంశస్థుడు అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ చదవాలనే ఆకాంక్షతో తన తాతగారు ఎన్నో విద్యాసంస్థలను స్థాపించాని అశోక్ గజపతి రాజు అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఏవియేషన్ ఎడ్యు సిటీకి భూములు ఇస్తున్నామని అన్నారు. జీఎంఆర్, మాన్సాస్ భాగస్వామ్యంతో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కానుంది.