టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ఇంట శుభవార్త వెల్లువెత్తింది. ఆయన రెండో కూతురు తన ప్రియుడ్ని వివాహం చేసుకుని కొత్త జీవితానికి అడుగుపెట్టింది. అయితే, ఈ శుభకార్యాన్ని ఆయన ప్రకటించిన తీరు మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో పెళ్లి అంటే భారీ హడావుడి, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో వరుస పోస్టులు కనిపిస్తుంటాయి. కానీ, జగపతిబాబు మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా, చాలా సింపుల్‌గానే తన కుటుంబంలోని శుభకార్యాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. విశేషమేమిటంటే… ఈ వీడియోను పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపొందించారు. పెళ్లికి సంబంధించిన అసలు ఫొటోలు గానీ, అల్లుడి వివరాలు గానీ బయటకు రాకుండా, కేవలం క్రియేటివ్ వీడియో ద్వారానే తన రెండో కూతురు వివాహం జరిగిన విషయాన్ని వెల్లడించారు.
ఆ వీడియోకు జగపతిబాబు పెట్టిన క్యాప్షన్ మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. “ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్” అంటూ సరదాగా, భావోద్వేగంతో క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వీడియో చూసిన వారు “సెలబ్రిటీ అయినా ఎంత సింపుల్‌గా ఉన్నారు”, “ప్రైవసీకి ఇంత విలువ ఇవ్వడం అభినందనీయం”, “పెళ్లి ప్రకటనలో కూడా క్రియేటివిటీ చూపించారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, కుటుంబాన్ని ప్రైవేట్‌గా ఉంచే టాలీవుడ్ సెలబ్రిటీల్లో జగపతి బాబు ఒకరు. ఆయన భార్య పేరు లక్ష్మి కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు. పిల్లల పట్ల జగపతి బాబు చాలా స్వేచ్ఛగా ఉంటారు. సుమారు ఆరేళ్ల క్రితం ఆయన పెద్దాయి మేఘన ఓ విదేశీయుడితో ఏడడుగులు వేసింది. వీరిది ప్రేమ వివాహం. ఇప్పుడు రెండో అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయాన్ని జగపతిబాబు స్వయంగా రివీల్ చేశారు.
">