కూటమి ప్రభుత్వంలో కీలకమైన రెండు పార్టీలు.. టీడీపీ, జనసేనలు. బీజేపీ మూడో పార్టీగా ఉన్నప్పటికీ.. మంత్రి పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ.. ఓటు, సీట్ల పరంగా ఆ పార్టీకంటే కూడా.. టీడీపీ, జనసేనలు బలంగా ఉన్నాయి. ఇవే గత ఎన్నికల్లోమెజారిటీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నాయి. ఇక, వచ్చే ఎన్నికల నాటికి కూడా కూటమి ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు పక్కా ప్లాన్‌తో టీడీపీ, జనసేనలు ముందుకు సాగుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పాలన వంటివి వాటికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఇదేసమయంలో పవన్ కల్యాణ్ కూడా.. తన శాఖల పరంగానే.. కాకుండా.. తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరంగా కూడా దృష్టి పెడుతున్నారు. అభివృద్ధిపై తరచుగా చర్చిస్తున్నారు. వారిసమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, తాజాగా పార్టీపై కూడా పవన్ కల్యాణ్ దృష్టిపెట్టారు.
మండల, గ్రామీణ స్థాయిలో పార్టీని డెవలప్ చేసేందుకు.. ఐదుగురితో కూడిన కమిటీలను నియమిస్తున్నా రు. ఈ నెల ఆఖరులోగా ఈ పనిని పూర్తి చేయాలని పవన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే.. ఇటు ప్రభుత్వ పరంగా ప్రజలకుచేరువ అవుతూనే.. మరోవైపు పార్టీని వదిలి పెట్టకుండా.. పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ.. పార్టీనిబలోపేతం చేసూఏందుకు మంఉదుకు సాగుతున్నారు. ఇలా.. రెండు పక్కలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేలా చూస్తున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఇటు ప్రభుత్వంలోనూ.. అటు పార్టీలోనూ సంస్కరణలు తీసుకువస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఇద్దరూ పార్టీకి చేరువ అవుతున్నారు. తరచుగా నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. సమస్యలు వింటున్నారు. సర్దిచెబుతున్నారు. ఇదేసమయంలో నాయ కులు కట్టు తప్పకుండా కూడా కాపాడుతున్నారు. మొత్తంగా అటు ప్రభుత్వాన్ని-ఇటు పార్టీని కూడా సమపాళ్లలో సమన్వయం చేస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి ఎక్కడా పట్టు బెసగకుండా చూస్తున్నారు. వైసీపీ హయాంలో ఇదే లోపించిన విషయం తెలిసిందే.