పార్టీ కోసం సోషల్ మీడియాలో యుద్ధాలు చేయడం… ప్రత్యర్థులపై ట్రోల్స్, పోస్టులు, డిజిటల్ పోరాటాలు చేయడం… ఇవన్నీ రాజకీయ పార్టీల్లో సాధారణమే. కానీ అదే పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేసిన కార్యకర్త కష్టాల్లో పడితే ఆ పార్టీ బాధ్యత ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు వైసీపీ చుట్టూ గట్టిగా వినిపిస్తోంది.
కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త పైచదువులు, ఉద్యోగం రిత్యా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. దేశం మారినా అతను పార్టీని మాత్రం వదల్లేదు. అక్కడ నుంచే కూటమి నేతలపై ట్రోల్స్, రాజకీయ పోస్టులు, పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో యుద్ధం చేయడం… ఇవన్నీ ఆయన రోజువారీ పనిగా మార్చుకున్నాడు. అయితే హఠాత్తుగా ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ప్రస్తుతం డల్లాస్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పైనే ప్రాణాలతో పోరాడుతున్నారు. వైద్య ఖర్చులు రోజుకు లక్షల్లో చేరుతున్నాయి.
అమెరికాలో వైద్య చికిత్స అంటే ఖర్చులు మాటల్లో చెప్పలేనివి. రోజురోజుకు పెరుగుతున్న హాస్పిటల్ బిల్లులతో కృష్ణారెడ్డి కుటుంబం ఆందోళనలో పడింది. ఇలాంటి కష్టకాలంలో వైసీపీ తరఫున ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన సాయం శూన్యం. చివరకు స్నేహితులు, శ్రేయోభిలాషులే ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. లక్ష్యం రెండున్నర లక్షల డాలర్లు. కొందరు స్పందిస్తున్నా.. పార్టీ మాత్రం కార్యకర్త ప్రాణాలు కాపేడేందుకు తన ఖజానా తలుపులు తెరవలేదు.
డల్లాస్‌లో జగన్ జన్మదిన వేడుకల సమయంలో ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు వెయ్యి డాలర్లు ఇచ్చారు. అది వ్యక్తిగత సాయం. పార్టీ పరంగా ఇచ్చింది కాదు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. పార్టీ కోసం పని చేసినంత వరకు విలువ… కష్టాల్లో పడితే పట్టించుకోరా? ఇదేనా కార్యకర్తల ప్రాణాలకు పార్టీ ఇచ్చే విలువా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
అయితే ఇదేం మొదటిసారి కాదు. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వారియర్ శ్యామ్ కలకడను కూడా ఇలాగే వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సరైన సాయం లేక ఆయన ప్రాణాలు కోల్పోవడం క్యాడర్ ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు విపక్షంలో ఉన్నా అదే కథ రిపీట్ అవుతోంది. ఇంకా విచిత్రం వైసీపీ కార్యకర్తలు అనారోగ్యంతో కష్టాల్లో పడితే చివరికి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెట్టి సాయం కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి పార్టీకి ఎంత అవమానమో.. పార్టీ క్యాడర్‌కు ఎంత బాధాకరమో చెప్పక్కర్లేదు.