ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో.. తెలుసుకుని.. దానికి అనుగుణంగా పాలన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల కోణంలోనే అధికారులు ఆలోచన చేయాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన సీఎం చంద్రబాబు... క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ఏ విధంగా అందు తున్నాయనే అంశంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు సంతృప్తికరంగా సేవలందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని.. తద్వారా వారి లో సంతృప్త స్థాయిలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఎలా చూస్తున్నారనే కోణంలో విశ్లేషించాలన్నారు. దీనికి అనుగుణంగా సేవలందించడంలో మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పారు. గంజాయి కట్టడిపై పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని తెలిపారు.
నేనూ వస్తా!
రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నిర్మూలనపై చేపట్టే అవగాహన కార్యక్రమాలకు తాను కూడా హాజరవుతానని సీ ఎం చంద్రబాబు తెలిపారు. గంజాయి నివారణకు, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజల కు తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు అవ సరమైన సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి మూడు ప్రాంతాల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేద్దామన్నారు. అమరావతి, తిరుపతి, విశాఖల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా యువతను కాపాడుకునే ప్రయత్నం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు సమయ పాలన అమలు చేయాలన్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.