రాష్ట్రంలో యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని కొన్ని సార్లు యువత చెడు మార్గం పడుతున్నారని.. దీనివల్ల వారి జీవితాలు కూడా ప్రభావానికి గురి అవుతున్నాయన్నారు. సిద్ధాంతం సరైంది కాకపోతే.. ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రస్తుతం యువతకు సరైన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే జనసే న పార్టీని ప్రారంభించామన్నారు.
కొత్త దారిలో నడవాలన్న కుతూహలం యువతలో ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కొందరు.. నక్సల్స్ బాట పట్టారని.. తీవ్రంగా నష్టపోయారని అన్నారు. సిద్ధాంతాలను వదల్లేక.. పట్టుకోలేక సతమ తం అయ్యారని అన్నారు. ``ఒక ఐడియాలజీ.. మనిషిని ఎంతగా ప్రభావానికి గురి చేస్తుందన్నది చాలా దగ్గరగా చూశా. అందుకే.. సిద్ధాంతం ఎంచుకునేటప్పుడే.. సరైన సిద్ధాంతాన్ని ఎంచుకోవాలి. అందుకే.. జనసేన పార్టీని పెట్టాం.`` అని పవన్ అన్నారు.
పార్టీలో ఉండి.. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి... గత ఆరుమాసాల కాలంలో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారు ఎలా వ్యవహరించాలి.. వారి బాధ్యతలు ఏంటి? ఏయే పనులు చేయాలి? అనే అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తాజాగా `పదవి - బాధ్యత` అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన కార్యక్రమంలో పవన్ దిశానిర్దేశం చేశారు. పదవి అంటే.. కేవలం అలంకారం కోసమే కాదని.. అదో బాధ్యత అని తెలిపారు.
పార్టీనినమ్ముకుని ఉన్న వారికి న్యాయం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో అందరూ గెలిచారని.. కానీ.. 2019 ఎన్నికల్లో ఒక్కరు మినహా అందరూ ఓడిపోయారని.. అయినా పార్టీ కోసం పనిచేసి.. తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చేశారని అన్నారు. అలాంటి వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని అడుగులు వేస్తున్నామని.. కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. అందుకే.. ఈ రోజు బలంగా పార్టీ నిలబడిందన్నారు. వచ్చే 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే కొనసాగేలా నాయకులు కలసి కట్టుగా పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాదు అని పవన్ తేల్చి చెప్పారు.