ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోతున్నారు. అన్ని సామాజిక వర్గాలను ఆయన అక్కున చేర్చుకుంటున్నారు. ఎస్సీల నుంచి గిరిజనుల వరకు అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. అంతేకాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. తను ఎవరికి ఏ హామీ ఇచ్చినా వెంటనే అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గిరిజనులు నివాసం ఉండే తండాల్లో రహదారుల నుంచి వ్యక్తిగత అవసరాల వరకు కూడా పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మంగళగిరి మండల పరిధిలోని ఇప్పటంలో పర్యటించారు.
ఇప్పటం.. గ్రామం వైసీపీ హయాంలో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో జనసేన ఆవిర్భావ సభకు కొందరు రైతులు తమ భూములు ఇచ్చారు. ఇదే అదునుగా.. వైసీపీ ప్రభుత్వం.. భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు చెందిన ఇళ్ల ప్రహరీ గోడలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేసింది. దీనిని నిరసిస్తూ.. అప్పట్లో పవన్ కల్యాణ్ బాధితులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ.. కన్నీరుమున్నీరు అయ్యారు. అప్పట్లో పవన్ ఆమెను స్వయంగా ఓదార్చి భరోసా ఇచ్చారు. తాను ఉన్నానని.. కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు.
ఈ క్రమంలో తాజాగా బుధవారం పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ పవన్ చూసి..మురిసిపోయారు. ఆయన పక్కనే కూర్చుని.. చేతిలో చేయి వేసి.. సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. తమ ఇంటికి నడిచి వచ్చిన పెద్దకొడుకుగా పవన్‌ను ఆమె అభివర్ణించారు. అంతేకాదు.. పవన్ బాగుండాలని.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని అభిలషించారు. అంతేకాదు.. పవన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కాగా.. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో చర్చించిన పవన్ కల్యాణ్..వారి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే నాగేశ్వరమ్మకు 50 వేలు.. ఆమె మనవడి ఉన్నత విద్యకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు.. ఇక నుంచి తనకు డిప్యూటీ సీఎంగా(ఎమ్మెల్యే) వచ్చే వేతనం నుంచి 5000 చొప్పున అతనికి ఇస్తానని పవన్ హామీ ఇచ్చారు. కాగా.. ఈ పరిణామంతో ఉబ్బితబ్బిబ్బయిన నాగేశ్వరమ్మ.. పవన్‌ను తన ఇంటి పెద్ద కుమారుడు అంటూ.. వ్యాఖ్యానించి.. ఆనంద బాష్పాలు రాల్చారు.