తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఈ సమావేశాలకు సంబంధించిన ప్రకటనను బుధవారం రాత్రి జారీ చేశారు. దీని ప్రకారం.. ఈ నెల 29 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఎన్ని రోజులు జరుగుతాయన్నది స్పీకర్, సభానాయకుడు(సీఎం), అధికార, ప్రతిపక్షాల సభా పక్ష సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే.. బుధవారం నారాయణపేట్ జిల్లాలో ప్రసంగించిన సీఎం రేవంత్.. సభాకార్యక్రమాలకు సంబంధించి ముందుగానే ప్రకటన చేయడం.. ఆ తర్వాత గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.
జల యుద్ధాలే!
ఇక, పేరుకు శీతాకాల సమావేశాలే అయినా.. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరగనున్న వాడివేడి చర్చలు.. సమావేశాల కు సెగపుట్టించనున్నాయనడంలో సందేహం లేదు. ప్రధానంగా జల యుద్ధాలకు ఈ సారి సభ వేదికకానుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్.. పాలమూరుకు అన్యాయం చేశారని.. కాంగ్రెస్ పార్టీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని దుయ్యబట్టారు. అదేవిధంగా ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ కూడా.. కాళేశ్వరంపై బాంబు వేయడంతోపాటు.. అక్విడెక్టులకు రంధ్రాలు చేసి.. జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీఅక్రమ ఇసుక కోసం.. కాంగ్రెస్ నేతలు చేసిన ఘాతుకాలని విమర్శించారు.
ఇక, మరోవైపు..ఏపీ చేపడుతున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కూడా.. రేవంత్ సహకరిస్తున్నారని.. బీఆర్ ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి కాపుకాస్తున్నాడని.. చంద్రబాబు శిష్యుడేనని ఇటీవల కేసీఆర్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో శీతాకాల సమావేశాలు వేడెక్కడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. అదేసమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యేల జంపింగ్, స్పీకర్ ఉత్తర్వులు, పంచాయతీ ఎన్నికల వ్యవహారం, పేదలకు ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ.. ఇలాఅనేక విషయాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఆయుధాలుగా ఈ సభను కదనరంగం చేయనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.