నటీనటులు: ప్రీతి పగడాల- ప్రణవ్ కౌశిక్- వంశీ పూజిత్- గౌతమ్ వాసుదేవ్ మీనన్- ఎస్పీ చరణ్- అను హాసన్- శివన్నారాయణ తదితరులు
సంగీతం: జోస్ జిమ్మీ
ఛాయాగ్రహణం: శక్తి అరవింద్
నిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె- సంపత్ మాక- సురేష్ రెడ్డి కొత్తింటి
రచన-దర్శకత్వం: ప్రవీణ్ ప్రత్తిపాటి
ఏడాదిలో చివరి వీకెండ్ అయిన క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలే రేసులో నిలిచాయి. వాటిలో ‘పతంగ్’ అనే చిన్న సినిమా కూడా ఉంది. వెరైటీ టైటిల్ కు తోడు.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: విష్ణు కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పూజిత్).. అరుణ్ (ప్రణవ్ కౌశిక్) చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. విస్కీకి చదువు అబ్బక పానీపూరి బండి నడిపిస్తుంటాడు. అరుణ్ బీటెక్ పూర్తి చేసి జీఆర్ఈ కోసం ట్రై చేస్తుంటాడు. విస్కీ.. ఐశ్వర్య (ప్రీతి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత ఆమెను అరుణ్ సహా అందరికీ పరిచయం చేస్తాడు. ఓ సందర్భంలో అరుణ్ తో కలిసి ట్రావెల్ చేసే క్రమంలో ఐశ్వర్య అతడికి దగ్గర అవుతుంది. అరుణ్ కూడా ఆమెను ఇష్టపడతాడు. కానీ విస్కీ విషయంలో ఏం చేయాలో తెలియక ఇద్దరూ సంఘర్షణకు గురవుతారు. మరి వీరి ప్రేమ గురించి విస్కీకి తెలిసిందా.. తెలిస్తే అతనెలా స్పందించాడు.. ఇంతకీ ఈ ముక్కోణపు ప్రేమకథ చివరికి ఏ మలుపు తిరిగింది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: అప్పటికే నిశ్చితార్థం అయి పెళ్లికి సిద్ధంగా ఉన్న అమ్మాయి.. మరో అబ్బాయి ప్రేమలో పడే కథతో రెండు దశాబ్దాల కిందట ‘నువ్వు నాకు నచ్చాయ్’ సినిమా తీసి దానికి ‘ది న్యూ లవ్ స్టోరీ’ అని ట్యాగ్ పెట్టారు. అప్పటికి సమాజంలో ఉన్న పరిస్థితులు.. అప్పుడొస్తున్న కథలతో పోలిస్తే అది నిజంగా న్యూ లవ్ స్టోరీనే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక వ్యక్తితో ప్రేమ లేదా పెళ్లి బంధంలో ఉన్నా.. ఇంకో వ్యక్తికి ఆకర్షితులు కావడంలో తప్పేమీ లేదనే మైండ్ సెట్ ఇప్పటి యువతలో చాలామందిలో వచ్చేసింది. తెరమీద ఇలాంటి కథలు కూడా బోలెడన్ని చూస్తున్నాం కూడా. ఇలాంటి టైంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల్లో ముందు ఒకరితో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మధ్యలో ఇంకొకరికి ఆకర్షితురాలయ్యే స్టోరీతో తెరకెక్కిన చిత్రం.. పతంగ్. ట్రెండీ క్యారెక్టర్లు.. సన్నివేశాలు.. డైలాగులతో ఈ కథను ముక్కోణపు ప్రేమకథను బాగానే నడిపించాడు కొత్త దర్శకుడు ప్రవీణ్ ప్రత్తిపాటి. కాకపోతే ఇందులో లాజిక్కుకు అందని.. జీర్ణించుకోలేని కొన్ని అంశాలు ప్రేక్షకులను డోలాయమానంలో పడేస్తాయి.
ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండగానే ఇంకొక అబ్బాయికి అమ్మాయి ఆకర్షితురాలైంది అంటే.. మొదటి అబ్బాయి కంటే రెండో అబ్బాయి ఎక్కువ ఇష్టమనే కదా? మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ ఏం ఉంటుంది? ఇద్దరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వాళ్లకే ఆ అమ్మాయి దక్కుతుంది అంటే.. ఈ ముగ్గురూ ఈ పోటీకి అంగీకారం తెలపడమే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. హీరోయిన్ తండ్రో మరొకరో పెట్టిన కండిషన్ మేరకు హీరో ఓవైపు.. విలన్ ఓవైపు నిలబడి ఒక పోటీలో తలపడడం ఎన్నో కథల్లో చూశాం. అది లాజికల్ గా అనిపించే విషయం. కానీ ‘పతంగ్’లో తన ముందు ఆప్షన్లు ఉన్నపుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడే మనస్తత్వం ఉన్న అమ్మాయిగా కథానాయిక పాత్రకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చినా సరే.. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఆమె ఇలా పోటీకి ఓకే చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇటు మొదటి అబ్బాయితో ఆమె ప్రేమలో పడడానికి దారి తీసే సన్నివేశాలు కానీ.. అటు రెండో అబ్బాయి వైపు ఆమె ఆకర్షితురాలయ్యే సీన్లు కానీ ఏమాత్రం బలంగా అనిపించవు. హీరోయిన్ పరిణతి లేని అమ్మాయి అని.. తనకు డెసిషన్ మేకింగ్ రాదని.. జస్టిఫై చేయడానికి చూసినా సరే.. ఇందులో సన్నివేశాలు సిల్లీగానే అనిపిస్తాయి.
కథకు ఎంతో ముఖ్యమైన సన్నివేశాలను ఇలా మరీ తేలిగ్గా చూపించడం వల్ల ‘పతంగ్’ సినిమాను సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి. కాకపోతే చాలా వరకు లైట్ హార్టెడ్ వినోదంతో దీన్ని ఒక టైంపాస్ ఎంటర్టైనర్ లాగా నడిపించడంలో మాత్రం రైటర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రత్తిపాటి విజయవంతం అయ్యాడు. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్ సీన్లతో.. ట్రెండీ డైలాగులతో ప్లెజెంట్ ఫీల్ ఇస్తూ సాగుతాయి ఇందులో సన్నివేశాలు. రెండో వ్యక్తితో హీరోయిన్ ప్రేమలో పడ్డాక ఆ ఇద్దరూ అనుభవించే సంఘర్షణ.. విషయం బయటపడ్డాక స్నేహితులిద్దరి మధ్య జరిగే ఘర్షణ వరకు ‘పతంగ్’ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ హీరోయిన్ని గెలవడానికి పతంగుల పోటీ అనగానే చాలా ఆడ్ గా అనిపిస్తుంది. దాని ఫాలోఅప్ సీన్లు కూడా విసుగు పుట్టిస్తాయి. కానీ చివర్లో ఓ నలభై నిమిషాల పాటు స్పోర్ట్స్ డ్రామాను ఆసక్తికరంగానే నడిపించారు. పతాక సన్నివేశాలు కూడా బాగున్నాయి. ముగింపు సన్నివేశాలను పరిణతితో తీర్చిదిద్దారు. కానీ ఈ కథను మలుపు తిప్పే పాయింటే ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. సుదీర్ఘ నిడివి కూడా ‘పతంగ్’కు మైనస్ అయింది. ప్లాట్ పాయింటుని ఇంకొంచెం కన్విన్సింగ్ గా చెప్పగలిగి ఉంటే.. నిడివి తగ్గించి ఉంటే ‘పతంగ్’ మంచి ఫీలింగ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం మిక్స్డ్ ఫీలింగే కలుగుతుంది.
నటీనటులు: ముఖ్య పాత్రధారులందరూ కొత్త వాళ్లే అయినా బాగా చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఎన్నారై అమ్మాయి ప్రీతి పగడాల క్యూట్ గా కనిపిస్తూ.. నటిస్తూ ఆకట్టుకుంది. పాత్రకు తగ్గట్లుగా తన నటన సాగింది. విస్కీ పాత్రలో వంశీ పూజిత్ యూత్ నచ్చే లుక్.. స్టైల్.. యాక్టింగ్ తో మెప్పించాడు. ప్రణవ్ కౌశిక్ కూడా బాగా చేశాడు. దర్శకుడిగా తన ఒరిజినల్ క్యారెక్టర్లోనే నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాకు ఆకర్షణగా మారాడు. ఆయన వల్ల సినిమా లెవెల్ మారింది. తనకు ప్రీతికి మధ్య సాగే కాన్వర్జేషన్లు ఆకట్టుకుంటాయి. ఎస్పీ చరణ్.. అను హాసన్.. పాత్రలు వారి నటన జస్ట్ ఓకే అనిపిస్తుందంతే. సహాయ పాత్రలు పోషించిన వాళ్లంతా బాగానేచేశారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘పతంగ్’ మెరుగ్గా అనిపిస్తుంది. జోస్ జిమ్మీ ట్రెండీ పాటలు అందించాడు. అవి హుషారుగా అనిపిస్తాయి. పాటలకు సరదాగా సాగే సాహిత్యం అందించారు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇండీ స్టయిల్లో సాగే సినిమాకు అందుకు తగ్గ ఛాయాగ్రహణమే అందిచాడు శక్తి అరవింద్. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. చిన్న సినిమా అయినప్పికీ.. గాలిపటాల పోటీల్లో వీఎఫెక్స్ బాగా చేసుకున్నారు. రైటర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రత్తిపాటిలో విషయం ఉంది. ముక్కోణపు ప్రేమకథలో గాలి పటాల పోటీ నేపథ్యంలో అతను ఎంచుకున్న కథాంశం లైన్ పరంగా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింటుకి ఆసక్తికర స్క్రీన్ ప్లే జోడించలేకపోయాడు. కన్విన్సింగ్ గా అనిపించేలా తెరపై ప్రెజెంట్ చేయడంలో తడబడ్డాడు. ఐతే కొన్ని ఎపిసోడ్లను అతను బాగా డీల్ చేశాడు. ప్లెజెంట్ ఫీల్ ఇచ్చేలా సన్నివేశాలను కన్సీవ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
చివరగా: పతంగ్.. ఎగిరింది కానీ
రేటింగ్- 2.5/5