టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లిపై గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడనుంది. వెండితెరపై `గీత గోవిందం`గా మెప్పించిన ఈ జంట, నిజజీవితంలోనూ ఒకటి కాబోతున్నారు. వీరిద్దరి రిలేషన్ గురించి ఇండస్ట్రీలో ఎన్ని గుసగుసలు వినిపించినా, ఇప్పటివరకు ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రౌడీ హీరో-నేషనల్ క్రష్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా విజయ్, రష్మిక విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఒకే చోట దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం అభిమానులకు స్పష్టమైపోయింది. అయితే, ఎక్కడా హడావుడి లేకుండా అత్యంత సన్నిహితుల మధ్య అక్టోబర్ 3వ తేదీన వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రానివ్వకుండా విజయ్-రష్మిక చాలా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నప్పటికీ, లోలోపల పెళ్లి పనులు మాత్రం మొదలైపోయాయని టాక్.
వచ్చే ఏడాది (2026) ప్రారంభంలోనే విజయ్-రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 26న వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్యే నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. దీంతో పాటు సెలబ్రిటీల ఫేవరెట్ డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక భారీ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని వార్తలు వస్తున్నాయి.