వంశీ ఎక్కడ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

admin
Published by Admin — December 30, 2025 in Politics, Andhra
News Image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న వంశీ, ఇప్పుడు ఏకంగా పోలీసుల రికార్డుల్లో ‘అజ్ఞాతంలో ఉన్న నిందితుడి’గా మారారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక హత్యాయత్నం కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (A1) చేర్చడంతో పోలీసులు ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అసలేం జరిగింది..  గతేడాది జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై జరిగిన దాడి ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు. వంశీ ప్రోద్బలంతోనే తనపై దాడి జరిగిందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు డిసెంబరు 17న హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుల పేర్లను కూడా చేర్చారు. నాటి ఘటనలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా, ఆయన రెచ్చగొట్టడం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని బాధితుడు పేర్కొనడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కేసు నమోదైనప్పటి నుండి వంశీని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. వంశీ ఇంట్లో లేకపోవడమే కాకుండా, ఆయన వ్యక్తిగత ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేవలం వంశీ మాత్రమే కాదు, ఆయన వెన్నంటి ఉండే ప్రధాన అనుచరులు కూడా ఫోన్లు ఆపేసి పత్తా లేకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఇక అరెస్ట్ భయంతో వల్లభనేని వంశీ ముందుగానే జాగ్రత్త పడ్డారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పోలీసులకు లైన్ క్లియర్ అయినట్లయింది. మరోవైపు, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వంశీ అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా కోర్టు వాయిదాకు హాజరుకాకపోవడంతో పోలీసులు మరింత సీరియస్‌గా ఉన్నారు. ప్రస్తుతం వంశీ ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. విజయవాడతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Tags
Vallabhaneni Vamsi Murder Case YSRCP Vijayawada Ap Politics
Recent Comments
Leave a Comment

Related News