కొన్నిసార్లు కొందరు రాజకీయ ప్రముఖులు చేసే పనులు.. తీసుకునే నిర్ణయాలతో వచ్చే మైలేజ్ అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటుంది. అందునా.. కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత వేసే ప్రతి అడుగు కౌంట్ లోకే వస్తుంది. రెండేళ్లుగా మౌనంగా ఉన్నగులాబీ బాస్ కేసీఆర్.. ఈ మధ్యనే బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ సీఎం రేవంత్ కు.. ఆయన ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయిందని.. ఇకపై ఆయన సర్కారు చేసే తప్పుల తోలు తీస్తానని వ్యాఖ్యానించటం.. అది కాస్తా తీవ్ర సంచలనానికి కారణం కావటం తెలిసిందే.
సదరు ఘాటు వ్యాఖ్య తర్వాత నుంచి కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని భావించిన చాలామంది ఆశల మీద నీళ్లు జల్లుతూ.. మళ్లీ మాట్లాడింది లేదు. నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిన వైనం ఆయన తీరును ప్రశ్నించేలా..కమిట్ మెంట్ ను క్వశ్చన్ చేసేలా మార్చింది.అయితే.. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కొలువు తీరిన సభకు కేసీఆర్ రావటం గులాబీ నేతలకు మాత్రమే కాదు ఆయన క్యాడర్ కు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చి పెట్టింది. రాజకీయ వర్గాలు సైతం కేసీఆర్ తీరును ఆసక్తిగా గమనించటం తెలిసిందే.
అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ కంటే ముందే సభకు వచ్చిన కేసీఆర్.. మూడంటే మూడు నిమిషాలే ఉండటం.. ఆ వెంటనే సభ నుంచి వెళ్లిపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సభలో ఉన్న మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రి రేవంత్ సభలోకి అడుగు పెట్టి.. నేరుగా కేసీఆర్ ఉన్న సీటు వద్దకు వచ్చి ఆయనకు అభివాదం చేయటం.. అందుకు ప్రతిగా కేసీఆర్ సైతం నమస్కారం చేయటం తెలిసిందే. ఈ ఆసక్తికర సంఘటన అన్ని టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయితే.. డిజిటల్ మాధ్యమాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ కంటెంట్ గా మారింది.
అందరూ వీరి గురించి మాట్లాడుకుంటున్న వేళలోనే.. కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవటంతో తిరిగి గులాబీ బాస్ వ్యవహారశైలి మీద చర్చ మొదలైంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సభలోకి అడుగు పెట్టిన సందర్బంగా తొమ్మిది నిమిషాలు సైతం కూర్చోకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో.. సభకు వచ్చిన తమ గులాబీ బాస్ తీరుతోభారీ మైలేజీ వచ్చిందని సంతోషపడుతునన గులాబీ దళానికి మూడు నిమిషాల ఎపిసోడ్ భారీ డ్యామేజ్ చేసిందని వాపోతున్న పరిస్థితి. అయినా.. మూడు నిమిషాలే సభలో ఉండుడేంది? జనాల పల్స్ ను పట్టించుకోకపోతే ఎలా సారూ?