ప్రస్తుతం తెలంగాణలోని అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదంగా మారిన ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. 1) కాళేశ్వరం. 2) పాలమూరు-రంగా రెడ్డి. ఈ రెండు ప్రాజెక్టులు.. రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారాయి. వచ్చే నెల 2 నుంచి పూర్తిస్థాయిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల అంశాలే.. సభలో తీవ్ర దుమారం రేపనున్నాయి. అధికార పక్షం కాంగ్రెస్.. కాళేశ్వరం అవినీతిని.. ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మాత్రం.. పాలమూరు-రంగారెడ్డిని కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఉపేక్షిస్తున్నారని చెబుతోంది. మరి పాలమూరు ప్రాజెక్టుకు శాపం ఎవరు? ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో పాపం ఎవరిది? అనేది కీలక చర్చ.
వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు ముందే.. అంటే.. 2007-08 మధ్య అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీనిని తెలంగాణ పోలవరం ప్రాజెక్టుగా కూడా ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుతో 2 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. అయితే.. 2009లో వైఎస్ మరణానంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభం.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్రుతం కావడంతో ఈ ప్రాజెక్టు అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. కొంత మేరకు జరిగింది. కానీ.. ప్రధానంగా నల్లగొండ ప్రజలకు, రైతులకు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే విధానానికి మాత్రం బ్రేకులు పడ్డాయి.
కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. ఆ సమయంలో ఆయన దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి వరకు పూర్తయిన.. ఒక ఛానెల్‌ను మాత్రమే ప్రారంభించి.. పనులు తర్వాత..చేపతామన్నారు. ఈలోగా కాళేశ్వరం, మేడిగడ్డ.. భద్రాచలంలో భక్తరామదాసు వంటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి.. అపరభగీరథుడు అన్న వైఎస్ పేరును తాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు ముందుకు సాగలేదు. కానీ.. అదేసమయంలో అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రం వడివడిగా పూర్తయింది. సో.. దీనిని బట్టి పాలమూరుకు ఎవరు శాపం.. ఎవరిది పాపం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లేఅయింది. దీంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు.