ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీవ్ర ప్రతికూల పరిస్థితితో పాటు.. మానసికంగా.. శారీరకంగా తీవ్రంగా ప్రభావితం కావటమే కాదు.. కేసుల చిక్కుముడులతో పూర్తిగా మారిపోయిన వైసీపీనేతల్లో ముఖ్యుడు వల్లభనేని వంశీగా చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరే నాటికి వల్లభనేని వంశీ ఉన్న తీరుకు.. ప్రస్తుత తీరుకు ఏ మాత్రం పొంతన లేనట్లుగా మారిపోవటం తెలిసిందే. స్వల్ప వ్యవధిలో దాదాపు పదిహేనేళ్ల వయసు మీద పడినట్లుగా ఆయన మారిపోయారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఒంటికాలి మీద చంద్రబాబు మీదా ఆయన కుటుంబం సభ్యుల మీదా ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు నోట వెంట మాట రావటానికి ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న వైనం కొద్దికాలంగా చూస్తున్నదే. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఆయన కనిపించటం లేదన్నది హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. డిసెంబరు 17న ఆయన మీద నమోదైన కేసులో అరెస్టు అవుతారని భావిస్తున్న వేళ.. ఆయన కనిపించకుండా పోవటం హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వంశీ మీదా హత్యాయత్నం కేసు నమోదైంది.
2024 జూన్ 7న సునీల్ మీద దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారన్నది ప్రధానఆరోపణ. దీంతో వారు కర్రలు..మారణాయుధాలతో తీవ్రంగా గాయపర్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వంశీతో పాటు రామక్రిష్ణ.. కొమ్మా కోట్లు.. రంగా.. కాట్రు శేషు.. ఎం. బాబు తదితరులను నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించి సమన్లు ఇచ్చేందుకు వారం క్రితం వంశీ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. ఎలాంటి ఉపశమనం పొందలేదు. దీంతో.. సెల్ ఫోన్ స్విచాఫ్ చేసిన వంశీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన అనుచురులు పలువురు కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లటంతో.. అందరి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. చూస్తుంటే.. కొత్త ఏడాదిలోనూ వంశీకి అరెస్టు చిక్కులు తప్పేట్లు లేవన్న మాట బలంగా వినిపిస్తోంది.