తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. అయితే, ఆయన మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో వారు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వెలుపల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువైందని, కాబట్టి మూసీ నది కన్నా ముందు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని హరీష్ రావు విమర్శించారు. ఇది శాసనసభ సమావేశంలా లేదని, గాంధీభవన్ లో సీఎల్పీ మీటింగ్ లా మారిందని చురకలంటించారు. ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతకాక బహిరంగ సభలో మాట్లాడిన విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ఆ మాటకొస్తే మూసీ ప్రక్షాళనను ముందుగా మొదలుపెట్టింది తమ పార్టీ అని చెప్పారు. హడావిడిగా పేదల ఇళ్లు కూల్చి వారిని రోడ్డున పడేయటానికి మాత్రమే తమ వ్యతిరేకమని హరీష్ రావు అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, బాడీ షేమింగ్ చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలు కూడా రేవంత్ కన్నా మంచి భాష మాట్లాడతారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పదేపదే చావు భాష మాట్లాడడం సరికాదని ఖండించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని, నీళ్ల ద్రోహి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.