వైసీపీ హయాంలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేసిన జగన్ ఆ తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శలు వచ్చాయి. జగన్ హయాంలో అమరావతిని శ్మశానంతో పోలుస్తూ వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకరమైన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.
కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించింది. అక్కడ పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక విషయాన్ని వెల్లడించారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నామని అన్నారు.
అమరావతిలో మొత్తం 420 భవనాలు, ప్లాట్లు నిర్మాణంలో ఉన్నాయని, అందులో 186 బంగ్లాలు, మిగతా 284 అపార్ట్మెంట్ మోడల్ నిర్మిస్తున్నామన్నారు. వర్షాల వల్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. 500 నివాస సముదాయాలు మినహా మిగతా భవనాలను మార్చి నెలాఖరుకి పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా పనులు చేపట్టామని తెలిపారు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం జనవరి 7న భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇంకా నాలుగున్నర ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, అందులో రెండు ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని నారాయణ వెల్లడించారు.