ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ను చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇక, తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి నారా లోకేశ్ కూడా చంద్రబాబుతో పోటీ పడి పెట్టుబడుల వేటలో విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆ ఇద్దరి ప్రయత్నాల ఫలితం నేడు కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలానికి అత్యధిక పెట్టుబడి ప్రతిపాదనలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనలలో ఏపీ 25.3% వాటాను దక్కించుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ఆధారంగా ఈ నివేదిక వెలువడింది. ఆ వివరాలు ప్రకారం ఫోర్బ్స్ ఇండియా బిజినెస్ మ్యాగజైన్ ఏపీని అగ్రగామిగా ప్రశంసిస్తూ ఒక కథనం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఇది శుభవార్త అని, కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభం అని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న విధానపరమైన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్పష్టమైన రంగాల వారీగా విధానాలను ప్రవేశ పెట్టడం వల్ల స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.