ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్నను నేడు దర్శించుకున్నారు. ఆ తర్వాత జగిత్యాలలో జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని పవన్ చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పోటీ చేయడం మాత్రం అలవాటు చేసుకోవాలని అన్నారు.
ఓటమికి భయపడకూడదని, ఆ రకంగా సిద్ధపడి పోటీ చేసే మనస్తత్వం జనసేన నేతలలో పెరగాలని చెప్పారు. పోటీ ఉన్నపుడే అనుభవం వస్తుందని, ప్రజాజీవితంలో ఉండగలమని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపైనే తన పోరాటమని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసమే జనసేన రాజకీయ పోరాటం చేస్తుందన్నారు.
100 మైళ్ల దూరం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా మొదలైందని, ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంజన్న సన్నిధి తనను కాపాడిందని, కష్టకాలంలో ఆధ్యాత్మిక బలం ఇచ్చి తనకు అండగా నిలిచిందని అన్నారు.