రేవంత్ చెప్పిన పని చంద్రబాబు చేశారా?
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ సందర్భంగా జగన్, కేసీఆర్ ల వల్ల తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నష్టం జరిగిందని ఆరోపించారు. జగన్ ను ఇంటికి పిలిచి పంచభక్ష పరవాణ్ణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 3 టీఎంసీలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ దని రేవంత్ దుయ్యబట్టారు. కమిషన్లు తీసుకున్న చరిత్ర వాళ్లదని, జగన్ ను భుజం తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించి నీతి వారిదని మండిపడ్డారు.
కానీ, చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీలో పనిచేసిన తాను చంద్రబాబును కాదనుకొని...ఆ పార్టీని వద్దని బయటకు వచ్చానని రేవంత్ అన్నారు. తెలంగాణ బాగు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజలను మెప్పించి ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. అటువంటి నేపథ్యం ఉన్న తాను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు
ఆ మాటకొస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపితేనే నదీజలాల వివాదంపై చర్చకు వస్తానని చంద్రబాబుకు చెప్పిన సందర్భాలున్నాయని రేవంత్ అన్నారు. తమ మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు ఆపేశారని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగాయని, కేసీఆర్ లేదా హరీష్ రావు వెళ్లి చూసుకోవచ్చని అన్నారు.