ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా మారుతున్న సమీకరణాలు అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ మోహన్ రెడ్డి గొంతుకగా, పార్టీ వాణిని బలంగా వినిపించిన ఒక కీలక నేత ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవ్వడం వైసీపీ కేడర్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేవలం రాజీనామాతో సరిపెట్టకుండా, షేక్ నియాజ్ తన బలాన్ని నిరూపించుకునేలా భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం నాడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా వేల మంది అనుచరులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతపురంలో తన పట్టు ఏంటో చూపించేందుకు సిద్ధమయ్యారు.
ఒక రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధి ఇలా అనుచరగణంతో పార్టీ మారడం అంటే, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, నియోజకవర్గంలో వైసీపీ ఉనికిపై పడే పెద్ద దెబ్బ. అదే సమయంలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకులో మంచి పట్టున్న నియాజ్ అహ్మద్ సైకిల్ ఎక్కడం అనంతపురం అర్బన్ రాజకీయాల్లో టీడీపీకి భారీ మైలేజీ ఇచ్చే అవకాశం.
కాగా, వైసీపీలో రాజీనామాల పరంపర ఒక్క అనంతపురానికే పరిమితం కాలేదు. గత నెలలో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో సుమారు 50 మంది నేతలు మూకుమ్మడిగా పార్టీని వీడటం అప్పట్లో సంచలనం రేపింది. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను, అలకలను అధిష్టానం లైట్ తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.