తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కృష్ణా జలాల యుద్ధం ఇప్పుడు సరికొత్త రాజకీయ రణక్షేత్రంగా మారింది. ఇప్పటివరకు ప్రాజెక్టుల అనుమతులు, కేటాయింపులపై జరిగిన రచ్చ.. ఇప్పుడు ముఖ్యమంత్రుల వ్యక్తిగత ప్రతిష్టలు, ప్రాంతీయ సెంటిమెంట్ల చుట్టూ తిరుగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీకి ఇది ఊహించని రాజకీయ అస్త్రంలా దొరికింది.
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘నీళ్లు-నిజాలు’ అంశంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా వ్యవహరించారు. తన ప్రాంతీయ వాదాన్ని గట్టిగా వినిపిస్తూ.. ``నాకు నా ప్రాంతమే ముఖ్యం, ఆ తర్వాతే పార్టీ, నాయకుడు. సీఎం కుర్చీలో కూర్చుని తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను`` అని కుండబద్దలు కొట్టారు. ఇంతటితో ఆగకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తామే ఆపించామని, ఆ పనులు ఆపితేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పిన ఘనత తమదేనంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయి. రేవంత్ వ్యాఖ్యలు వెలువడిన కొద్దిసేపటికే వైసీపీ సోషల్ మీడియా మరియు అధికారిక ప్రతినిధులు రంగంలోకి దిగారు. రాయలసీమ ప్రాజెక్టులను ఆపించినట్లు రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రేవంత్ తన ప్రాంతం కోసం పార్టీని కూడా పక్కన పెడతానంటుంటే, చంద్రబాబు మాత్రం తన మిత్రుడి కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడుతున్నారని వైసీపీ మండిపడింది.
``తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి, రాయలసీమకు మరణశాసనం రాశారు. తన స్వార్థంకోసం, లాలూచీపడి రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు. తన చేతులతో కరువునేలకు మరణ శాసననం రాశారు. తెలంగాణ సీఎం రేవంత్‌తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డే ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. చంద్రబాబు వల్లే ఆరోజు రాష్ట్రానికి ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చింది, కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కమీషన్లకోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి తన చేతిలోకి తీసుకున్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూనే ఉన్నాడు`` అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి పేల్చిన ప్రాంతీయ సెంటిమెంట్ అనే బుల్లెట్‌ను వైసీపీ తన గన్‌లో లోడ్ చేసుకుని బాబుపైకి గురిపెట్టింది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.