తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2026 సంక్రాంతి పండుగ ఒక భారీ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. సాధారణంగా సంక్రాంతికి ముగ్గురు లేదా నలుగురు హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ ఈసారి ఏకంగా ఏడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’ తో ఈ జాతర మొదలు కానుంది. అదే రోజున విజయ్ నటించిన పొలిటికల్ డ్రామా `జననాయకుడు` కూడా థియేటర్స్ లో సందడి చేయనుంది.
జనవరి 10న శివకార్తికేయన్ మాస్ యాక్షన్ మూవీ `పరాశక్తి` ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన `మన శంకర్ వరాప్రసాద్ గారు` జనవరి 12న, రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రం జనవరి 13న రాబోతున్నాయి. శర్వానంద్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `నారీ నారీ నడుమ మురారి` మరియు నవీన్ పోలిశెట్టి నటించిన వైవిధ్యభరిత చిత్రం `అనగనగా ఒక రాజు` జనవరి 14న పోటీ పడుతున్నాయి.
వెయ్యి కోట్ల పెట్టుబడి.. 1500 కోట్ల వేట:
ఈ సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల వెనుక ఉన్న బడ్జెట్ అక్షరాలా రూ. 1000 కోట్లు. ఒక్క ‘రాజా సాబ్’ చిత్రమే రూ. 500 కోట్ల భారీ వ్యయంతో రూపొందగా, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరాప్రసాద్ గారు’ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కింది. మిగిలిన మీడియం రేంజ్ సినిమాలు, డబ్బింగ్ చిత్రాల ఖర్చు కలిపితే వెయ్యి కోట్లు దాటుతోంది. అయితే, నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకే సీజన్‌లో, పట్టుమని పది రోజుల్లో ఇంత భారీ మొత్తాన్ని రాబట్టడం తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద సవాల్.
అయితే రూ. 1500 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వాలంటే సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు క్యూ కట్టాల్సిందే. కానీ, వారం రోజుల వ్యవధిలో ఏడు సినిమాలు చూడటం అంటే సామాన్య ప్రేక్షకుడికి ఆర్థికంగా భారమే. మల్టీప్లెక్స్ రేట్లు, క్యాంటీన్ ఖర్చులు చూస్తుంటే.. ఏ సినిమాలు క్లిక్ అవుతాయి, ఏవి వెనుకబడతాయి అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో వరుసగా వస్తున్న ఈ సినిమాల వల్ల థియేటర్ల కేటాయింపు కూడా తలనొప్పిగా మారింది. పెద్ద సినిమాలు మెజారిటీ థియేటర్లను ఆక్రమించేస్తుండటంతో, మీడియం రేంజ్ సినిమాల పరిస్థితి కత్తి మీద సాములా తయారైంది. బయ్యర్లు కేవలం అడ్వాన్స్‌లు చెల్లించి చేతులు దులుపుకుంటుండటంతో, చాలా మంది నిర్మాతలు సొంత రిస్క్ మీద సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.