బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా శనివారం రాత్రి 9 గంటల వరకు సభ నడిచింది. `నీళ్లు-నిజాలు` అనే అంశంపై సభలో చర్చ చేపట్టారు. దీనిపై పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి చివరగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నీటి సమస్యలను కేసీఆర్ తొలుత ప్రస్తావించారని అన్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని.. గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చారని అన్నారు.
దీంతో బీఆర్ ఎస్ సభ్యులు కోరకపోయినా..తామే జోక్యం చేసుకుని.. సభలో నీళ్లు-నిజాలు అనే అంశంపై చర్చ చేపట్టామన్నా రు. దీనికిమాజీ సీఎం కేసీఆర్ హాజరై సమస్యలు ప్రస్తావిస్తారని.. పరిష్కారాలు చెబుతారని ఆశించినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ, ఆయనకు సభ అంటే.. చులకనో.. లేక తనకెందుకనో.. అనుకుంటున్నారని, అందుకే.. సభకు రాకుండా పార్టీ కార్యాల యంలోనే మాట్లాడుతున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలంటే.. అనుభవజ్ఞులైన వారు సభకు రావాలని అన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం సభకు రావడం లేదని విమర్శించారు.
మమ్మల్ని అవమానించారు..
గతంలో పదేళ్లపాటు కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సభలో తీవ్రంగా అవమానాలకు గురి చేశారని.. రేవంత్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ.. తమ పార్టీ సభ్యులు ప్రజల సమస్యలపై గళం వినిపించారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్నది సభకు రావాలన్నదే కీలకమని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ అలా చేయడం లేదన్నారు. తాము ఎంతో గౌరవంగా ఆయనను చూస్తున్నామని.. కానీ, బయట రాజకీయాలకే ఆయన పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, వాటిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, గత రెండేళ్లుగా కేసీఆర్ సభకు రాకుండా.. డుమ్మా కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరైన సంప్రదాయం కాదని.. సభకురావాలని కోరుతున్నామని తెలిపారు.